ప్రైవేటు పాఠశాలల పై ఏది నియంత్రణ?



            ప్రైవేటు  పాఠశాలలపై  ఏది  నియంత్రణ?
నేడు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు  ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ జి‌.లను  ఏమాత్రము ఖాతర్ చేయడం  లేదు. ప్రాథమిక పాఠశాలలు 9 వేలు, ఉన్నతపాఠశాలలు 12వేలు మాత్రమే ఫీజులు తీసు కోవాలని  జి‌.లుండగా,అడ్డు, అదుపు లేకుండా ఫీజులు గుంజుతున్నారు. L.K.G పిల్లవానికి ఫీజు 50 వేలా? ఇది హైద్రాబాద్ నగరం లో కాగా, చిన్న పట్టణాలలో కూడా 10 నుండి 30 వేల వరకు ఫీజులు లాగుతున్నారు.
నాసిరకం భోధన  ఫీజుల నిష్పత్తిలో జీతాలు అందులో పనిచేసే టీచర్లకు ఇస్తున్నారంటే అదీ లేదు. సగటున 5వేలు, 6వేలు ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకొంటున్నారు. పిండి కొద్ది రొట్టె అన్నట్లు వారి భోధన కూడా అలాగే ఉంటుంది. B.Ed, D.Ed. చేసిన వారికి జీతాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని, ఇంటర్ ,డిగ్రీ చేసిన వారిని ఉపాధ్యాయులుగా నియమించుకొంటున్నారు.  
కొత్తసీసాలో  పాత సారాయి  నేడు ప్రతి స్కూలు ఆకర్షణీయమైన పబ్లిక్, టాలెంట్, కాన్సెప్ట్, టెక్నో, టెక్నో స్పేస్, గ్రామర్, ప్లే స్కూల్ , అని తమ పాఠశాల పేరు ప్రక్కన తగిలించుకొని  విద్యార్ధుల తల్లితండ్రులను బుట్టలో వేసుకొంటున్నాయి.కేరళ టీచర్లచే భోధన అంటూ,స్థానికంగా లభించే గృహినులను టీచర్లుగా 4, 5 వేలకు నియమించుకొని చదువు వెలగబెట్టిస్తున్నారు. విద్యార్ధులలో సృజనాత్మకతను, విద్యా నైపుణ్యాలను, వైఖరులను, మూర్తిమత్వాన్ని, నైతిక విలువలను,ప్రశ్నించే తత్వాన్ని, అవగాహనను పెంపొందించే విధంగా భోధనాభ్యసన ప్రక్రియ ఉండడం లేదు. కానీ ప్రోబెల్ విధానమని, కిండర్గార్డెన్ అని, ప్లేవే మెథడ్ అని, అబాకస్ అని, ఐ.ఐ.టి ఫౌండేషన్ అని, మెడికల్ ఫౌండేషన్ అని ఇలా రకరకాల పేర్లతో ఊదరకొడుతూ పేరెంట్స్ ను దిమ్మ తిరిగేట్లు చేస్తున్నారు. భోధనలో మాత్రం మార్పేమీ లేదు. బట్టి పట్టించడం, చిలక పలుకుల్లా ఒప్పచెప్పించుకోవడం.దీనికే  అమాయక పేరెంట్స్ మురిసిపోతారు.
మూడు పువ్వులు ఆరుకాయలు ప్రైవేటు బడులలో ఫీజులే అధికం అనుకొంటే , మరోపక్క పుస్తకాలు, నోటు బుక్ లు ,యూనిఫారాలు, షూలు,బెల్టులు, డైరీలు, మొదలగు స్టేషనరీ అంతా అక్కడే కొనాలి.బయట కొనకూడదు. ఈవిధంగా కూడా వారు దోపిడి చేస్తున్నారు. ప్రభుత్వ సెలవుదినాలు ,పనిగంటలు వారికి పట్టవు. ఆదివారాలలో కూడా కొన్ని స్కూళ్ళు నడుస్తాయి.ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు బడులు పని చేస్తాయి. ఎంత ఎక్కువసేపు పిల్లవాన్ని బడిలో ఉంచుకొంటే, ఆబడిలో చదువు అంత బాగా చెప్తారని మూర్ఖపు పేరెంట్స్ భావన. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎంత ఒత్తిడికి గురవుతున్నారో కొంచమైనా తల్లి దండ్రులు ఆలోచించుట లేదు.
I.I.T ఫౌండేషన్  2 వ తరగతి లోనే ఐ.ఐ.టి  ఫౌండేషన్ అంట! ఏమీ లేదు. 2వ తరగతి పిల్లవానికి 3వ తరగతి లెక్కలు (గణితం) భోధించడమే ఐ.ఐ.టి ఫౌండేషనట.3వ తరగతి వానికి 4వ తరగతి అంశాలు రుద్దడం ఐ.ఐ.టి ఫౌండేషన్.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 42 ప్రకారం ప్రైవేటు బడులవారు క్రింది నియమాలు పాటించాలి.
1 . ఎంత ఫీజు వసూలు చేసేది ఫ్లెక్సి రూపం లో ప్రకటన బోర్డ్ పెట్టాలి.
2 . పాఠశాల పేర్ల ప్రక్కన ఆకర్షణీయమైన తోకలుతగిలించడం తీసివేయాలి.
3. పుస్తకాలు,నోటు బుక్ లు అమ్మరాదు.
4 .ఉపాధ్యాయుల అర్హతలు, వారి వేతనాల వివరాలు తెలపాలి.
5 .విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లు sc,st,bc,వికలాంగులకు కేటాయించాలి.
     పై విషయాలు వెల్లడించని  770 పాఠశాలల యాజమాన్యలను అరెస్టు చేసి జైల్లో పెట్టండని , హైద్రాబాదు జిల్లా కలెక్టర్ M.K మీనా ఆగ్రహం వ్యక్తం చేశా డంటే  ప్రైవేటు స్కూళ్ళ నిర్వాకం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.   

Comments

Popular Posts