మహోన్నత వ్యక్తులు -3 నేతాజీ సుభాష్ చంద్రబోసు
సుభాష్ చంద్ర బోసు జనవరి 23, 1897 న ఒరిస్సా రాష్ట్రం ,కటక్
పట్టణములో సంపన్న కుటుంబములో జన్మించాడు. తండ్రి జానకీనాధ బోస్. ప్రభుత్వ ప్లీడర్.
తల్లి ప్రభావతి. వారికి గల 14 మంది సంతానంలో సుభాష్ 9వ వాడు.
సుభాష్
బాల్యములో తల్లి తండ్రుల ఆప్యాయత,
అనురాగములకై అర్రులు చాచేవాడు.ఎందుకంటే వారిది పెద్ద కుటుంబము. అనేకమంది నౌకర్లు. అంతమంది కుటుంబ
సభ్యుల మధ్య ,తనకంటూ ఒకగుర్తింపు ఉండాలని ,తన
ఉనికిని తల్లితండ్రులు గుర్తించాలని
ఆరాటపడేవాడు. అసలే ఆయనది సున్నితమనస్తత్వం. సత్ప్రవర్తన ,
నిరంతరశ్రమ విజయ సాధనకు సోపానం అనేభావన బాల్య దశ లోనే అలవరసుకొన్నాడు.
సుభాష్ ను 5సం. వయస్సులో కటక్ లోని ఆంగ్ల ప్రాథమిక
పాఠశాలలో చేర్చారు. చదువులో తోటి విద్యార్థు లందరి కంటే ముందుండేవాడు. ఐతే ఆనాడు
తెల్లవారి పిల్లలకు ,నల్లవారి పిల్లలకు మధ్య బ్రిటిష్ వారు వివక్షత చూపేవారు. ఆ పాఠశాలలో క్రీడాకార్యకలాపాలలోనూ ,వాలంటీర్ దళం లోనూ భారతీయ పిల్లలకు చోటు లేదు. తెల్లవారి పిల్లలతో కలిసి ఆడుకొనే అవకాశం లేదు. ఆ విధంగా తన బడిలోనే జాతి వివక్షతను చూచి కలత చెందాడు చిన్నారి బోసు.తిరుగుబాటు
మనస్తత్వం పెంపొందే బీజాలు పడ్డాయి అతనిలో ఆనాడే.
బ్రిటిష్ వారి పై ద్వేషం పెంపొందింది. “తెల్లవాడు నా బూట్ పాలిష్ చేస్తుంటే చూడడం నాకు ఆనందం కల్గించునని “ తన ఆవేశాన్ని తెల్పుతాడు ఒక లేఖ రాస్తూ తల్లితండ్రులకు.
మెట్రిక్యులేషన్
లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, తరువాత కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. అక్కడ
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస బోధనలపట్ల
ఆకర్షితుడవుతాడు. స్వతంత్ర భావాలు,దేశభక్తి గల విద్యార్థి బృందాలను
కాలేజీలో ఏర్పాటు చేశాడు. 1917 లో కలకత్తాలోని స్కాటిష్ మిషనరీ కాలేజీలో చేరి, బి.ఏ డిగ్రీ
పొందాడు తన 22వ ఏట. ఆ
తర్వాత మానసిక తత్వశాస్త్రములో ఏం.ఏ చేయాలని చేరగా, తండ్రి
కోరికపై ఐ.పి. యస్
చదవడానికి ఇంగ్లండ్ వెళ్లవలసి వచ్చింది. తనకు ఇంగ్లండ్ వెళ్ళడము,పైగా శత్రు దేశంలో చదవడం
ఇష్టం లేకపోయినను తండ్రికొరికను అంగీకరించాడు. ఇంగ్లండ్ వెళ్ళి 1920,జులై
లో ఐ.పి.యస్ కు
ప్రవేశ పరీక్ష రాసి 4 వ ర్యాంక్ సాధించాడు. కానీ ఐ.పి.యస్ అధికారిగా బ్రిటిష్ ప్రభువుల కొలువులో
చేరి తన ప్రజలకు చేయగలిగే మేలు చాలా
స్వల్పమని త్వరలోనే గ్రహిస్తాడు. ఇదే అభిప్రాయాన్ని 1921 జనవరి 26 న తన అన్న శరత్
చంద్ర బోస్ కు లేఖ ద్వారా తెలియజేస్తాడు. తర్వాత తండ్రికి ఐ.పి.యస్ ను
వదులుకోవాలనే నిర్ణయాన్ని తెలియ జేయగా తండ్రి చాలా అసంతృప్తిని ప్రకటిస్తాడు. అయినప్పటికి సుభాష్ భారత మాతసేవకు అంకితమవ్వాలనే దృఢ నిశ్చయముతో
1921 ఏప్రిల్ 22 న ఐ.పి.యస్ కు
రాజీనామా చేశాడు.
1921 జులై 16న ఇండియాకు తిరిగివచ్చి మహాత్మా గాంధీని కలిశాడు. సహాయ నిరాకరణ ఉద్యమం
ద్వారా గాంధీజీ అప్పటికే కాంగ్రెస్ లో ప్రముఖ
నాయకుడయ్యాడు. కాని గాంధీజీ విధానాలు స్వాతంత్ర్యాన్ని
సాధించేవిగా లేవని సుభాష్ త్వరలోనే గ్రహించాడు. తర్వాత సుబాష్ తన స్వరాష్ట్రం బెంగాల్ లో ప్రముఖ నాయకుడైన చిత్తరంజన్ దాస్ కు కుడి భుజంగా
నిలిశాడు.
1923 లో చిత్తరంజన్ దాస్,
మోతీలాల్ నెహ్రూ గాంధీజీతో విభేదించి
కాంగ్రెస్ కు రాజీనామా చేసి , స్వరాజ్యపార్టీని స్థాపించగా అందులో
బోసు చేరాడు. స్వరాజ్య పార్టీ పత్రిక “బంగ్లార్ కథ” పత్రికకు,మరియు “ఫార్వర్డ్ బ్లాక్” అను దినపత్రికకు సుబాష్ సంపాదకుడిగా నియమించ బడినాడు. స్వరాజ్యపార్టీ స్థాపించిన 2 నెలలకే కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించి ,చిత్తరంజన్
దాస్ మేయర్ అయ్యాడు. బోస్ ప్రధాన కార్యనిర్వాహకుడయ్యాడు.
1924 నుండి
27వరకు బోసు ను అరెస్టు చేసి మండలే జైల్ లో నిర్బంధిచారు. 1930 ఉప్పుసత్యాగ్రహం ఉద్యమంలోను,1931,
1936 లోను బ్రిటిష్ వారు కక్ష కట్టి బోస్ ను అరెస్టు చేసి జైల్లో వుంచారు.
క్రమంగా
సుభాష్ సేవను,
త్యాగనిరతిని గుర్తించిన కాంగ్రెస్ 1938
హరిపుర సమావేశంలో సుబాష్ ను
అధ్యక్షునిగా ఎన్నుకొన్నది. 1939 లో కూడా సుబాష్ డా. పట్టాభి సీతారామయ్య పై నెగ్గి అద్యక్షుడవగా,
గాంధీజీ అలిగాడు. “పట్టాభి
ఓటమి నా ఓటమి”
అన్నాడు.దీనితో బోస్ కాంగ్రెస్
కు రాజీనామా చేసి “ఫార్వర్డ్ బ్లాక్” పార్టీని స్థాపించాడు.
1940 లో సుభాష్ ను మళ్ళీ అరెస్టు చేసి
గృహనిర్బంధం లో ఉంచగా 1941 లో తప్పించుకొని ,అనేక మారువేషాలతో
జర్మనీ చేరాడు. 2 వ ప్రపంచ యుద్ధం లో బ్రిటన్
కు సహకరించ వద్దని, బ్రిటన్ శత్రువులైన జర్మనీ, జపాన్ లతో చేతులు కలిపి వారి పక్షాన పోరాడాలని,బ్రిటన్
ను మట్టికరిపించాలని జర్మనీ రేడియోలో ప్రసంగించి భారతీయులలో నూతనోత్తేజాన్ని నింపాడు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పెనలా
ఎగిసిపడడానికి కారణం సుబాష్ ప్రేరణే. 1943 లో జపాన్ సహకారము తో 40,000 మందితో “ఆజాద్ హింద్ ఫౌజ్” ( ఐ.ఎన్.ఏ ) సైన్యాన్ని సింగపూర్ లో నెలకొల్పినాడు. వీరికి సుబాష్ “నేతాజీ” అయ్యాడు. 1944 మార్చి లో ఆజాద్ హింద్ ఫౌజ్ దళాలు “జై హింద్”, “ఛలో ఢిల్లీ” నినాదాలతో భారత భూభాగం లోకి చొచ్చుకొని వచ్చాయి. ఈ యుద్ధం లో 16,000 మంది ఆజాద్ హింద్ సైనికులు అమరులయ్యారు.
1945 ఆగష్టు 11 న 2వ ప్రపంచ యుద్ధం లో ఓడిపోయి, జపాన్ లొంగిపోయింది. నేతాజీ రష్యా సహాయం కోసం సింగపూర్ నుండి సైగాన్ చేరుకొన్నాడు.
అక్కడినుండి విమానము లో రష్యాకు బయలు దేరాడు. కాని నేతాజీ ప్రయాణిస్తున్న విమానము తైపే లో 1945
ఆగష్టు 18 న కూలి పోయింది. సగం కాలిన గాయాలతో జపాన్ సైనికశిబిరం లో చికిత్స పొందుతూ తన ప్రక్కనే
వున్న తన అనుచరుడైన హాబీబుర్రహమాన్ తో-“హబీబ్, నా అంతిమ ఘడియలు సమీపించాయి.నా జీవితకాలమంతా మాతృ దేశ స్వాతంత్ర్యం కోసమే పోరాడాను.నా దేశ స్వాతంత్ర్యం కోసం నేను
మరణిస్తాను. భారత స్వతంత్ర్య పోరాటాన్ని కొనసాగించాలని మన దేశ ప్రజలకు చెప్పు. భారత దేశం స్వతంత్ర
మవుతుంది” అని చెప్తూ 1945 ఆగష్టు 18 రాత్రి 9 గం. ల కు సుభాష్ చంద్రుడు అస్తమించాడు.
[అయితే ,నేతాజీ మరణముపై కొందరికి సందేహాలు కూడా ఉన్నవి. ఆనాడు నేతాజీ విమాన ప్రమాదముపై దర్యాప్తు జరిపిన కమిటీ సభ్యులలో
మెజారిటీ సభ్యులు నేతాజీ మరణించాడని అభిప్రాయపడగా,కొందరు సభ్యులు బ్రతికేవుండ వచ్చని అభిప్రాయం వ్యక్త పరిచారు.]
Good information sir.
ReplyDelete