మహోన్నత వ్యక్తులు-4 సర్దార్ వల్లభ బాయ్ పటేల్
వల్లభాయ్ పటేల్ 1875,అక్టోబర్ 31 న గుజరాత్ రాష్ట్రం,కైరా
జిల్లాలోని కర్మసాద్ అను గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.తండ్రి జవరిభాయ్
1857 తిరుగుబాటులో పాల్గొని పోరాడిన యోధుడు.ఈతని నలుగురు సంతానంలో 3వ వాడు విఠల్
భాయ్ పటేల్ కాగా,4వ వాడు వల్లభాయ్ పటేల్.వీరిద్దరూ బాల్యంలో వ్యవసాయ పనులలో
పాల్గొంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు.వీరిద్దరికీ చిన్నతనంలోనే తండ్రి
నుండి ధైర్యసాహసాలు, నిజాయితీ, నిర్మోహ మాటం సంక్రమించినవి.
వల్లభాయ్ హైస్కూల్ లో చదివే రోజుల్లో తమ పాఠశాల
ఉపాధ్యాయుడు మున్సిపల్ ఎన్నికలలో పోటీకి నిలబడెను.అతని ప్రత్యర్ధి బాగా
డబ్బున్నవాడు.తమ ఉపాధ్యాయుడు పేదవాడు.కాని మంచిపేరున్న వ్యక్తి.డబ్బు ముందు
మంచితనం ఓడిపోవద్దని భావించి, వల్లభాయ్ కొందరు విద్యార్థులను కూడగట్టి పకడ్బందీగా
ప్రచారం చేసి ఆ ఎన్నికలలో తమ గురువుగారిని గెలిపించాడు.
వల్లభాయ్ కు 1891 లో వివాహమయ్యింది.నదియద్ నగర్ లో చదివి 1897 లో
మెట్రిక్యులేషన్ పాసయ్యాడు.1909 లో భార్య క్యాన్సర్ తో మరణించింది.వల్లభాయ్ కి ఒక
కుమార్తె,ఒక కుమారుడు.1910 లో ఇంగ్లాండ్ వెళ్ళి చదివి 1913 లో బారిష్టర్ పట్టాతో
తిరిగి వచ్చాడు.అహమ్మదాబాద్ లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ ప్రారంభించి
కష్టపడేమనస్తత్వం,కార్యదీక్షా పరుడు కావడం వల్ల అనతి కాలంలోనే
ప్రసిద్ధుడయ్యాడు.సంపాదనాపరుడయ్యాడు.ఆ రోజుల్లో అతడు దొరల వేషంలో సూటు,బూటుతో
ఉండేవాడు.గుజరాత్ క్లబ్ లో మెంబర్ గా ఉండి,బ్రిడ్జి ఆటలో మంచి ప్రావీణ్యం ఉండేది.
ఒకసారి గాంధీజి ఆ క్లబ్ కు వచ్చి అహింసను గూర్చి, సత్యాగ్రహం ను గూర్చి ఉపన్యాసం
ఇచ్చాడు. అది వల్లభాయ్ ను ఆకట్టుకొంది. గాంధీకి అనుయాయుడయ్యాడువల్లబాయ్.కాంగ్రెస్
లో చేరాడు.1917 లో అహమ్మదాబాద్ లో ప్లేగువ్యాధి బాధితులకు సేవ లందించాడు.1918లో
గుజరాత్ లో కైరా జిల్లాలోరైతుల సమస్యలపై గాంధీజీ ఆందోళన నిర్వహించగా వల్లభాయ్,
గాంధీ వెన్నంటి ఉండి వరదలలో పంటలు దెబ్బతిన్న రైతులకు భూమిశిస్తు రద్దు చేయాలని
ప్రభుత్వానికి వినతిపత్రం సమ ర్పించాడు.కాని ప్రభుత్వం పట్టించు కోలేదు. భూమిశిస్తు
రద్దుచేసేవరకు పటేల్ గాంధీమార్గంలో సత్యాగ్రహం నిర్వహించాడు. రైతులలో తను
ఒకడిగా మారి సూటు బూటు వదలి,లాల్చి దోవతి ధరించసాగాడు.
కొన్నాళ్ళు వల్లభాయ్ అహమ్మదాబాద్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశాడు.1920 లో
సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు.గాంధీని గ్రుడ్డిగా తన సోదరుడు అనుసరించడం
విఠల్ భాయ్ కి నచ్చలేదు.మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ వంటివారి పంథాలో విఠల్
చేరిపోయాడు.అయినా వల్లభాయ్ గాంధీజీ మార్గాన్ని వీడలేదు.గాంధీకి కుడిభుజంగా
ఉండేవాడు.
వల్లభాయ్ ఖ్యాతిని వ్యాపింపచేసినది ‘బార్డోలి సత్యాగ్రహం’.ఇది
1928 లో ఆరు మాసాలపాటు వల్లభాయ్ నిర్వ హించాడు.రైతులపై విధించిన అధిక పన్నులు తగ్గించాలని
ఉద్యమం నడిపాడు.అనేకమంది రైతులను ఖైదు చేశారు.వల్లభాయ్ ని కూడా అరెస్టు చేయాలని
తలంచారు.కాని అంతసాహసం చేయలేక బ్రిటిష్ ప్రభుత్వం రాజీకి వచ్చి రైతుల సమస్యల
పరిష్కారానికి ఒప్పుకొన్నారు.తన శిష్యుని ధైర్యసాహసాలకు,కార్యదక్షతకు సంతోషించి
గాంధీజీ ‘సర్దార్’ అని ప్రశంసించాడు.అప్పటినుండి సర్దార్ పటేల్
అయ్యాడు.
1929
లో సర్దార్ పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే అవకాశం వచ్చినా గాంధీజీ సలహాపై జవహర్
లాల్ నెహ్రూకు వదిలి పెట్టాడు.1930 లో ఉప్పుసత్యాగ్రహం లో పాల్గొని అరెస్టయ్యాడు.1931
లో తొలి సారిగా కరాచి కాంగ్రెస్ సభకు అద్యక్షు డయ్యాడు. రౌండుటేబుల్ సమావేశం
విఫలమయ్యాక 1932 లో పటేల్ ను గాంధీజీతో పాటు అరెస్టు చేసి పూనాలోని యరవాడ జైలులో
16 నెలల పాటు నిర్బంధించారు.ఈ కాలంలో తన తల్లి,తర్వాత సోదరుడు మరణించినప్పుడు
ఇంటికి వెళ్లివచ్చేందుకు ‘కండిషన్ బెయిల్’ కూడా పటేల్ కోరలేదు.
1940 లో గాంధీజీ నిర్వహించిన వ్యక్తిసత్యాగ్రహం లో అందరికంటే పటేల్
ముందుండి నడిపాడు.1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సర్దార్ ను అరెస్టు చేసి
అహమ్మద్ నగర్ కోటలో బంధించారు. 1947 లో స్వాతంత్ర్యానంతరం
నెహ్రూ ప్రభుత్వం లో హోం శాఖామంత్రి మరియు ఉప
ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు.మతకలహాలను అణచడంలో చాలా కష్టపడవలసి వచ్చింది.దాదాపు
10,000 మంది ముస్లింలను ఎర్రకోటలోకి చేర్చి వారి ప్రాణాలను కాపాడినాడు.
వల్లభాయ్ కు ఉక్కుమనిషి అని పేరుతెచ్చిపెట్టిన అంశం సంస్థానాల
విలీనీకరణ.దేశ విభజన నాటికి 562 స్వదేశీ సంస్థానాలు ఉండేవి.వీటిలో కాశ్మీర్ మినహా
మిగిలిన సంస్థానాలన్నిటిని అపర చాణక్యుడిలా, తన రాజనీతిని ఉపయో గించి రాజులను
ఒప్పించి,కొందరిని భయపెట్టి ఇండియాలో విలీనం చేశాడు. ఇతని చొరవ వల్లనే ఇండియన్
సివిల్ సర్వీస్ లు (IAS.IPS) స్వాతంత్ర్యానంతరము పునఃనెలకొల్పబడినవి.
జీవితాంతం దేశసేవకు, దేశసమగ్రతకు కృషిచేసిన అలుపెరగని పోరాటయోధుడు 1950
డిశంబర్ 15 న బొంబాయి లో
పరమపదించాడు.
[నెహ్రూతో
విభేదాలు;స్వాతంత్రోద్యమ కాలంనుండే వల్లభాయ్ కు, నెహ్రూకు
విభేదాలు వుండేవి. గాంధీజీపై గౌరవముతో సహించాడు.స్వాతంత్ర్యానంతరం
స్వదేశీసంస్థానాల విలీనీకరణలో నెహ్రూ శాంతివైఖరిని కాదని బలప్రయోగంతో సైనిక చర్య
చేపట్టి విజయం సాధించాడు.పాకిస్థాన్ కు చెల్లించవలసిన 64 కోట్ల రూపాయలను ఇవ్వరాదని
నెహ్రూతో వాధించా డు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో నెహ్రూ బలపరిచిన చక్రవర్తుల
రాజగోపాల చారిని కాదని రాజేంద్రప్రసాదును పటేల్ ఎంపిక చేశాడు.
పురస్కారములు; మరణానంతరము ఎప్పుడో 40 సం//లకు పటేల్ కు
భారతరత్నఅవార్డును (1991) ఇవ్వడం అతనిని అవమానించడమే నని కొందరు విమర్శించినారు. ఈ
మహా మనిషి కీర్తి ప్రతిష్టల ముందు భారతరత్నఅవార్డు ఎంత? అలాగే ఇటీవల నరేంద్రమోది
గుజరాత్ లోని సాధు ద్వీపం లో దాదాపు 3000 కోట్ల రూపాయలు వెచ్చించి భారీ ఉక్కు విగ్రహాన్ని
ప్రపంచంలోనే ఎత్తైన 597 అడుగులతో నిర్మించ తలపెట్టాడు.అంతఖర్చు పెట్టి,డబ్బు
వృధాచేసి విగ్రహం నిర్మించడం గాంధేయవాది, నిరాడంబరుడైన పటేల్ కు నిజమైన నివాళి
కానేరదు. ఆ ధనము ఏ పవర్ ప్రాజెక్టో, లేదా నీటిపారుదల ప్రాజెక్టుకో ఖర్చు పెడితే
ఉక్కుమనిషి ఆత్మ సంతోషిస్తుంది.
ఇటీవల
మోదీ సర్కార్ సర్దార్ పటేల్ జన్మదినం
అక్టోబర్ 31 ని రాష్ట్రీయ్ ఏకతా దివస్ (జాతీయ ఐక్యతా దినము) గా జరుపుకోవాలని
ప్రకటించింది.]
Comments
Post a Comment