పుస్తకాల బ్యాగులు- విద్యార్థుల గుదిబండలు!
పాపం, పుణ్యం, ప్రపంచమార్గం
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని
పూవుల్లారా !
అయిదారేడుల పాపల్లారా !
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా !
అచ్చటి కిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచ్చటికో
ఎగురుతు పోయే,
ఈలలు వేస్తూ ఎగురుతు పోయే
పిట్టల్లారా !
పిల్లల్లారా !
గరిక పచ్చ మైదానాల్లోనూ
తామర పూవుల కోనేరులలో,
పంటచేలలో, బొమ్మరిళ్ళలో
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహ ధూళితో, కచ భారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున
విహరిస్తుండే
పరమాత్మలు
ఓ చిరుతల్లారా !............ అన్నాడు మహాకవి శ్రీశ్రీ, చిన్నారుల గూర్చి.
అటువంటి పరమాత్మలు,స్వేచ్చగా పిట్టల్లా ఎగిరే
పిల్లలు భుజాలపై బరువులతో,వంగిపోయిన నడుములతో చేయని పాపానికి శిలువను మోసే బాల
ఏసులైనారు నేడు.నిత్యం ఇండ్ల నుండి పాఠశాలలకు పుస్తకాల బ్యాగులతో బస్సులు ఎక్కుతూ
దిగుతూ, పాఠశాల అంతస్తుల మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండే చిన్నారులు మన కళ్ళముందు
కనిపిస్తున్నామనకు మామూలే అయిపోయింది.
5వ
తరగతి చదివే విద్యార్థుల పుస్తకాల బ్యాగ్ బరువు సగటున 20 కిలోలు ఉంటున్నది. రోజూ
అంతేసి బరువులతో పిల్లలు బడికి వెళ్ళి రావడం ఎంత నరకయాతనో కొందరైనా ఆలోచించడం
లేదు. చిరుప్రాయంలోనే వెన్నెముక వంగి పోయి, కీళ్ళు అరిగి పోయి పిల్లల పెరుగుదలపై
ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు చెపుతున్నారు.
L.K.G పిల్ల వానికి 12 నోటుబుక్ లా? పుస్తకాలు ఎన్ని ఎక్కువ ఉంటే
ఆ స్కూల్లో అంత బాగా చదువు చెప్తున్నట్లు లెక్క. అవసరం ఉన్నా,లేకపోయినా అనేక
నోటుబుక్స్ ప్రైవేటు స్కూల్ వాళ్ళు అంటగట్టుచున్నారు వాళ్ళ వ్యాపారం కోసం.ఇది
పిల్లల పాలిట శాపమయ్యింది.
స్కూల్ పిల్లల బ్యాగుల బరువుపై గతంలో అనేక సార్లు పార్లమెంటులో చర్చలు
జరిగినవి.ప్రముఖ రచయిత R.K.నారాయణ్ రాజ్యసభలో పుస్తకాల బరువుపై
ప్రశ్నించాడు. యశపాల్ కమిటీ కూడా పుస్తకాల బరువును తగ్గించాలని అనేక సూచనలు
చేసింది.అయిప్రభుత్వము దీనిపై సరియైన చర్యలు తీసుకోలేదు.
పాశ్చాత్య దేశాలలో బ్యాగులను ఇంటికి తెచ్చేది లేదు.స్కూల్ లోనే హోంవర్క్
ముగించుకొని,బ్యాగులు అక్కడేవదలి వస్తారు.మనదేశంలో ఈ విధానం కొన్ని స్కూళ్ళలో
మాత్రమే అమలుచేస్తున్నారు.క్లాస్ రూమ్ లలో బుక్స్ భద్ర పరచు కోవడానికి
బల్లలు.డెస్కులు వంటి సౌకర్యం ఉండాలి.ఫీజులు భారీగా గుంజే కార్పోరేట్ స్కూళ్ళలో
కూడా ఇటువంటి సౌకర్యం లేదు.పిల్లలు బడినుండి వచ్చి ఇంటివద్ద హోం వర్క్ చేస్తేనే
తల్లిదండ్రులకు తృప్తి,బడిలో పాఠాలు బాగా చెప్తున్నారని వాళ్ళనమ్మకం.
విద్యాశాఖాధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ సెలవు దినాలలో స్కూల్స్
నడిపేవారిపై చర్యలు తీసుకొంటున్నారు కాని, ఈ విషయం మాత్రం పట్టించుకోవడము లేదు.
ఇది
ఇలాగే కొనసాగితే స్వేచ్ఛగా, పిట్టల్లా ఎగిరుతు పోయే, ఉల్లాసంగా ఆటలు ఆడే పిల్లలు
మనకు కనబడరు. లేతవయస్సులోనే నడుము వంగిపోయి, ముసలివాళ్ళవడం ఖాయం.పశువులకు కట్టిన
గుది బండలు తీసిన తర్వాతకూడా ఏవిధంగా సరిగా నడవలేవో, విద్యార్థులు కూడా అదేవిధంగా
తయారవుతారు. చురుకుదనం కోల్పోతారు.
Comments
Post a Comment