మహోన్నతవ్యక్తులు -1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
భారత జాతి గర్వించదగిన
మహామేధావి ,తత్వవేత్త,అధ్యాపకుడిగా
వృత్తిని ప్రారంభించి ,అత్యున్నత భారత రాష్ట్రపతి పదవిని
అధిష్టించిన మహోన్నత వ్యక్తి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.
సర్వేపల్లి
రాధాకృష్ణన్ 1888 ,సెప్టంబర్ 5వ తేదీన తమిళనాడులోని తిరుత్తణి లో పేదకుటుంబంలో జన్మించాడు. తండ్రి వీరాస్వామయ్య
తహశీల్దార్. తల్లి సీతమ్మ. ఇతని పాఠశాల విద్యాభ్యాసం తిరుపతి, నెల్లూరు లలో కొనసాగింది. మద్రాస్ క్రిష్టియన్ కాలేజీనుండి
ఏం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండే అసాధారణ మైన తెలివితేటలు
కల్గివుండేవాడు. 16 సం. వయస్సులో 10 సం.ల బాలిక శివకామమ్మతో
వివాహం జరిగింది. ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో సీటు వచ్చిననూ,ఇంగ్లండ్ వెళ్ళి చదివేందుకు డబ్బులేక మానుకొన్నాడు. 1909 లో
21 సం. వయస్సులో కుటుంబాన్ని పోషించేందుకు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో
ఆసిస్టంట్ లెక్చరర్ గా ఉద్యోగంలో
చేరాడు . ఈ కాలంలో ఉపనిషత్తులు, భగవద్గీత , బ్రహ్మ సూత్రాలు, బౌద్ధ,జైన మత గ్రంథాలు బాగా అధ్యయనము చేశాడు. వీటితోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాలను , ఆంగ్లసాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసి ఆంగ్లభాషపైన, తత్వశాస్త్రము పైన మంచి పట్టు సాధించాడు.
ఈయన ప్రతిభను గుర్తించి మైసూరు విశ్వవిద్యాలయము 1918లో ప్రొఫెసర్ గా నియమించింది. రాధాకృష్ణన్ గారి ప్రసంగాలు విద్యార్ధులను ఎంతగానో
ఆకట్టుకొనేవి . విద్యార్ధుల పట్ల ప్రేమ,వాత్సల్యం కల్గి వుండేవాడు.
1921 లో
అశుతోష్ ముఖర్జీ , రవీంద్రనాథ్ ఠాగోర్ ల ఆహ్వానం పై కలకత్తా యూనివర్సిటీ లో ప్రొఫెసర్
గా చేరాడు. మైసూర్ యూనివర్సిటీ లో ఘనంగా వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. తమ అధ్యాపకునికి వీడ్కోలు
చెప్పడానికి విద్యార్ధులు ఆయన ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన ఇంటిముందు గుర్రపు బండి
సిద్ధంగావుంది. బండికి కట్టిన గుర్రాలను తొలగించి, రైల్వే స్టేషన్
దాకా బండిని విద్యార్ధులే లాక్కొని వెళ్లారు. అది విద్యార్ధులలో ఆయన పట్ల ఉన్న
ప్రేమకు సంకేతం. విద్యార్ధుల అభిమానానికి రాధాకృష్ణన్ కళ్ళు చెమ్మగిల్లాయి.
ఆనాడు గురు శిష్యుల హృదయాను బంధము ఆవిధంగా ఉండేది.
కలకత్తా
యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఉన్న రోజుల్లో ‘భారతీయ తత్వశాస్త్రము’ అను గ్రంథం వ్రాసి పాశ్చాత్య
పండితుల ప్రశంసలు పొందాడు. దీనితో పాటు ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిప్లేక్సన్, రికవరీ ఆఫ్ ఫేత్, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్,దిహిందూ వ్యూ ఆఫ్ లైఫ్, ఈ స్టెర్న్
రెలిజిన్స్ అండ్ వెస్టర్న్ థాట్
ఈతని రచనలు.
ఆక్స్ ఫర్డ్
యూనివర్సిటీ వారి ఆహ్వానము పై వెళ్ళి ఇంగ్లండు, ఫ్రాన్స్, అమెరికా దేశాలలో ప్రాచ్య తత్వ శాస్త్రము పై అనేక ఉపన్యాసాలు ఇచ్చి వచ్చాడు. ఇతనికి
అనేక విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్ లను ఇచ్చి సత్కరించాయి.
1931 లో ఆంధ్ర విశ్వవిద్యాలయము నకు వైస్ ఛాన్సలర్ గా నియమించ బడెను. ఇదే సం. లో నానాజాతి సమితి ఇంటలెక్చువల్ కొ ఆపరేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యాడు.
1946 లో భారత
రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు.1949 లో ఉన్నతవిద్యలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి రాధాకృష్ణన్ నాయకత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.
1952 నుండి 1962 వరకు భారత తొలి ఉపరాష్ట్రపతి గా పదవినలంకరించారు. బాబు రాజేంద్రప్రసాదు తర్వాత 1962 నుండి
1967 వరకు రెండవ భారత రాష్ట్రపతి గా పదవిని చేపట్టారు. 1954 లో భారతరత్న పురస్కారం లభించింది.
1956 లో భార్య మరణించింది. వీరికి సంతానం 5
గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి.శేష జీవితం మద్రాస్ లోని స్వంత ఇంట్లో గడుపుతూ 1975 ఏప్రిల్ 17 న పరమపదించారు.
ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన రాధాకృష్ణన్ గారి జన్మదినమును ‘ఉపాధ్యాయుల దినోత్సవముగా’ సెప్టెంబర్ 5 ను భారత ప్రభుత్వము
ప్రకటించి, ప్రతియేటా గురుపూజోత్సవం నిర్వహిస్తున్నది.
Comments
Post a Comment