మహోన్నత వ్యక్తులు -2. బాలగంగాధర తిలక్



బాలగంగాధరతిలక్ మహారాష్ట్ర లోని రత్నగిరి లో 1856  జూలై 23 వ తేదీన పార్వతీబాయి,గంగాధర తిలక్ దంపతులకు జన్మించాడు. తండ్రి విద్యాశాఖలో అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్.
         తిలక్ పూనాలోని దక్కన్ కాలేజీ లో చదివి పట్టభద్రుడయ్యాడు. తర్వాత ఎల్ .ఎల్.బి చేశాడు . భారతీయుల విద్యాభివృద్ధికి నడుం బిగించి 1880 లో న్యూ ఇంగ్లీష్ స్కూల్అను పాఠశాలను ప్రారంభించించాడు . ఇదే తర్వాత దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ గా రూపొందింది. తర్వాత ఫెర్గూసన్ కళాశాలను స్థాపించి , దానిలో ఆంగ్ల భాషా అధ్యాపకుడిగా పనిచేశాడు. 16 వ ఏటనే తిలక్ కు వివాహమయ్యింది.
          తిలక్ మరాఠా అను ఆంగ్ల పత్రికను , కేసరి అను మరాఠి  పత్రికను నడిపి , తన జాతీయభావాలను , దేశభక్తిని ప్రజలకు అందించాడు. 1889 లో జాతీయకాంగ్రెస్ లో చేరి , అనతికాలములోనే ప్రముఖ నాయకుడయ్యాడు. కాంగ్రెస్ లో లాలా లజపతి రాయ్ , బిపిన్ చంద్రపాల్, వీరసావర్కార్ , వంటి వారితో కలిసిపనిచేశాడు. మితవాదకాంగ్రెస్ రాజకీయాలపై ఇతనికి నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని తలంచాడు. 1907 లో కాంగ్రెస్ అతివాద , మితవాద గ్రూపులుగా విడిపోయింది. తిలక్ అతివాద నాయకుడయ్యాడు.' లాల్-బాల్-పాల్ ' అతివాద త్రయముగా గుర్తింపు పొందారు. వీరి నాయకత్వములో 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతర ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమంలో విదేశీ వస్తువులను హిష్కరించి, తగుల బెట్టారు. బెంగాల్ విభజన రద్దు చేసేవరకు బ్రిటిష్ వారిపై ఒత్తిడి తెచ్చారు.
    తిలక్ పై బ్రిటిష్ ప్రభుత్వం కక్ష కట్టింది. 1908 లో కేసరి పత్రికలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు , రాజద్రోహం నేరం మోపి తిలక్ ను 6 సం. మాండలే జైలు లో నిర్బంధించింది. ఈ జైలు లోనే గీతారహస్యం అను గ్రంథాన్ని వ్రాశాడు. ఇది భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యానము. Arcitic home in the vedaas అను మరొక గ్రంథం వ్రాసి , ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చినవారని ఒక సిద్ధాంతాన్ని లేవనెత్తాడు.
        1916 లో అనీబిసెంట్ తో కలిసి హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్వరాజ్యం నా జన్మ హక్కు. అది బ్రిటిష్ వాళ్ళు పెట్టే బిక్ష కాదు. నేను సాధించి తీరుతాను . నా దేహానికి ముసలి తనం వచ్చినా, నా చైతన్యానికి వృద్ధాప్యం రాలేదు’. అని భారతీయులను ఉత్తేజితులను చేశాడు. అంతకు ముందు శివాజీ ఉత్సవాలను , గణపతి ఉత్సవాలను నిర్వహించి ప్రజలలో స్వదేశీ సంస్కృతి, ధర్మముపట్ల  శ్రద్ధాసక్తులను పెంపొందించి, వారిని  సంఘటిత పరచి, వారిలో దేశభక్తిని, చైతన్యాన్ని రగుల్కొల్పాడు .
           తిలక్ గాంధీ తో రాజకీయంగా  విభేదించిననూ, స్వాతంత్ర్యసమరములో గాంధీతో కలిసి పనిచేశాడు. జీవితాంతం అలుపెరుగక పొరాడి,భారతీయ అశాంతి పితామహుడు  (Father of india’s unrest) గా ప్రసిద్ధికెక్కిన  బాలగంగాధర తిలక్ 1920  ఆగష్టు 1 వ తేదీన తనువు చాలించాడు. లోకమాన్యుడు గా అమరుడయ్యాడు. తిలక్ భౌతిక కాయాన్ని  గాంధీజీ స్వయంగా భుజముపై  మోయడానికి ముందుకు రాగా , బ్రాహ్మణులు మాత్రమే శవవాహకులుగా ఉండాలన్నారు తిలక్ బంధువులు. ప్రజాసేవకుడికి ఆ నియమాలు వర్తించవని  గాంధీజీ శవ వాహకుడయ్యాడు.  

Comments

Popular Posts